దక్షిణామూర్తి ప్రదక్షిణము
ప్రవేశము
జగద్గురు శ్రీ మచ్ఛంకర భగవత్పాదుల అవతారం మానవ జాతి బహు జన్మలనోము ఫలం. జీవిత పరమార్థమేమిటో, దాన్ని ఎలా అందుకొని తరించాలో మొగమాటం లేకుండా చాటి చెప్పిన మహానుభావుడాయన. అందుకోసమాయన చేసిన బోధనలు, వ్రాసిన రచనలు అసంఖ్యాకం. బోధనలు వినే భాగ్యమాకాలం వారికి పడితే, రచనలు చదివే మహాభాగ్య మీకాలంలో మనకు దక్కింది. చిత్రమేమంటే ఇవి చదువుతూంటే ఆయన మూర్తి వచ్చి మన దగ్గర కూచున్నట్టే ఉంటుంది. అందుకే ఎవరైనా మీకు గురువెవరని అడిగితే తడువుకోకుండా భగవత్పాదులని సమాధానమిస్తుంటాను నేను.
భగవత్పాదులు మన కనుగ్రహించి పోయిన రచనలిన్ని అన్ని కావు. ముఖ్యంగా వాటన్నిటినీ మనం మూడు జాతులుగా విభజించవచ్చు. మూడూ సాధకులలో మూడు తెగలవారి నుద్ధేశించి సాగిన రచనలు, ఉత్తమాధికారుల కోసమాయన భాష్యగ్రంథాలు, మధ్యముల కోసం ఉపదేశసాహస్రి లాంటి ప్రకరణాలు. మరి మందాధికారుల కోసం దశశ్లోకీత్యాది స్తోత్రాలు, అందులో ప్రతి ఒక్కటి ఒక అమూల్యమైన రత్నము. ప్రతి ఒక్కటికీ ఒకే ఒక అద్వైత విజ్ఞాన దీప్తిని దిక్కుల వెదజల్లేదే. అది చిన్నదీ, పెద్దదీ, భాష్యం. స్తోత్రమనే తేడా లేదు. ఎక్కడ దేనిని కదలించినా దానిలోనే సమగ్రమైన విజ్ఞానం దాగి ఉంటుంది. పోతే దానిని బయటికి లాగి మరలా దాని నంతటినీ ఆకళించుకొని అనుభవానికి తెచ్చుకోవటమే మనబోటి సాధకుల కర్తవ్యం.
ఇదిగో ఇదే సరిగా నేను చేయదలుచుకొన్న సదుద్యోగం. ప్రస్థానత్రయ పారిజాతం- జగద్గురు మహోపదేశం - సాధకగీత, అనే నెపం పెట్టి స్వామి వారి అద్వైత భావాలన్నిటినీ యథాశక్తిగా వెలికి తీసి సాధక లోకానికందించాను. పోతే వారి స్తోత్రాలను కూడా ఒకటి రెండు వ్యాఖ్యానించి అందులో దాగిన అనర్ఘ భావాలను కూడా బయటపెట్టాలని తోచింది. నిర్వాణదశక వ్యాఖ్య ఆ దృష్టితోనే రచించి ప్రకటించాను. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా వ్యాఖ్యానించాలని మనసులో పడింది. అన్ని స్తోత్రాలూ ఒక ఎత్తయితే ఈ దక్షిణామూర్తి స్తోత్రమొక్కటీ ఒక ఎత్తు. ఇది ఆచార్యులవారి స్తోత్రాలన్నిటిలో మకుటాయమానమైనది. స్తోత్రరాజమని చెప్పినా చెప్పవచ్చు. లక్ష పొటెన్సీ గల హోమియో మాత్రలో ఎంతటి శక్తి ఉందో, అంతకు మించిన శక్తి ఉన్నది ఈ చిన్న స్తోత్రంలో భాష్య ప్రకరణాదులన్నిటిలో విస్తరించి చెప్పిన విషయజాతమంతా ఎంతో సంగ్రహించి రచించినదీ స్తోత్రం. ఇది లస్పర్శిగా చూడగలిగితే ఇక ఏ గ్రంథమూ తడవనక్కర లేదనిపిస్తుంది. అందుకేనేమో గురువుగారి కత్యంత ప్రియశిష్యుడైన సురేశ్వరుడాయన భాష్యద్వయానికి వార్తికాలు వ్రాసి వార్తిక కారుడని ప్రసిద్ధి చెందినవాడు మరలా చేయివేసి తాకినది దశశ్లోకీ ఒక్కటే. మానసోల్లాసమని ఒక మహోజ్జ్వలమైన శ్లోకవార్తికం వ్రాశారాయన ఈ స్తోత్రానికి నిజంగా మానసోల్లాసమే అది సందేహం లేదు.
ఇంత ప్రాశస్త్యాన్ని సంపాదించుకొన్నదీ దక్షిణామూర్తి స్తోత్రం. అయితే ఒక చిన్న ఆశంక దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటున్నారే. మూర్తి పూజ ఉపాసకులైన ద్వైతులకే గాని అద్వైతులు చేయవలసిన సాధన ఆత్మవిచారమొక్కటేనని గదా భగవత్పాదులు బోధించింది. అలాంటప్పుడు- ''తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదమ్ శ్రీ దక్షిణామూర్తయే'' అని ముగ్గురికి నమస్కార మంటున్నాడు. కాబట్టి సగుణమే కావాలది. మరి ఈ గురుమూర్తి ఎవరు? ఇద్దరూ ఒకేతత్త్వమా? లక రెంటికీ తేడా ఉందా? చూడబోతే ఇదంతా ఉపాసనా మార్గమేగాని జ్ఞానమార్గం కాదని తోస్తుంది. అలాగే తోచింది చాలామంది సాధకులకు. తదనుగుణంగానే, వారీ స్తోత్రానికి వ్యాఖ్యానాలు వ్రాసి ప్రకటించారు. సురేశ్వరులు కూడా ఆ మాటకు వస్తే కొంత అటు మొగ్గుచూపినట్టు కనిపిస్తుంది. దక్షిణామూర్తి కొక రూపకల్పన - దానికొక మంత్రమూ - అనుష్ఠానమూ - ఇలాంటి ప్రక్రియ కూడా ఉదాహరించారాయన తన గ్రంథాంతంలో. అయితే అది సగుణోపాసకులను కూడా కలుపుకోటానికి చెప్పారను కోవచ్చు మనం.
కాగా భగవత్పాదు లిందులో జ్ఞానమే ఉద్దేశించారు. మరేదీగాదని నా నమ్మకం. అలాగైతేనే వారి భాష్య గ్రంథాల దగ్గరినుంచీ స్తోత్ర గ్రంథాల వరకూ ఏకవాక్యత Consistancy అనేది కుదురుతుంది. లేకుంటే కుదరదు. పైగా జ్ఞానాని కదనంగా ఉపాసనా మార్గ మాయన లోకాని కదే పనిగా బోధించనక్కరలేదు. అది పూర్వ మీమాంసకు లెలాగూ నిరూపణ చేశరు. కృతస్య కరణ మన్నట్టు చేసిందే చేయటం దేనికి మరలా. అంతవరకూ శాస్త్రకారుల లోకంలో ఎవరూ స్పృశించనిది - స్పృశించి లోకానికుపదేశిస్తే జన్మతారకమైనది ఏదో - అదే బోధించారాయన జగద్గురువుగా. నూటికి నూరుపాళ్ళూ అలాగే బోధ చేస్తూ వచ్చారాయన. అది మనకాయన రచనలన్నిటిలో ప్రత్యక్షరమూ తార్కాణమయ్యే లక్షణం.
దీనిని బట్టి మన మీ మకుట పాదానికి జ్ఞానపరంగా అర్థం చెప్పాలేగాని ఉపాసనా పరంగా కాదు. దక్షిణామూర్తికి నమస్కారం అంటే ఆ దక్షిణామూర్తి ఎవరో కాదు, గురుమూర్తి! ఆ గురుమూర్తి మరలా ఎవరో కాదు. తస్మై, అంటే ఈ నమస్కరించే శిష్యపరమాణువే. అప్పటికి నమస్కర్తా - నమస్కార్యుడూ - ఇద్దరూ ఒకటే. పైకి భిన్నంగా కనిపిస్తున్నారంత మాత్రమే గాని చైతన్యరూపంగా అందరూ ఒకే ఒక తత్త్వం. ఇదే సర్వాత్మ భావం. ఈ సర్వాత్మ భావాన్ని బయటపెట్టటమే ఆచార్యులవారి సంకల్పం. కనుకనే సర్వాత్మత్వ మితి స్ఫుటీకృత మని చివర ఫలశ్రుతి శ్లోకంలో కంఠోక్తిగానే చాటి చెప్పారాయన. ఆయన హృదయాన్ని గ్రహించిన ఆయన శిష్యుడు సురేశ్వరుడు కూడా గ్రంథారంభంలో ఈ రహస్యాన్నే వాక్రుచ్ఛాడు - ''ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగినే'' అని. ఇక సందేహమేముంది మనకు?
Next