గురించి
శ్రీ గురుభ్యో నమః
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు పూజ్యులు, ప్రాతః స్మరణీయులు. వీరు శ్రీమతి సీతమ్మ, శ్రీ సుందరరావు దంపతులకు 1927వ సంవత్సరం జులై 15 వ తేదీ, ప్రభవ జ్యేష్ట శుద్ధ పూర్ణిమ బుధవారము ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించిరి. వీరి విద్యాభ్యాసము ఓంగోలు, గుంటూరు, వాల్తేరులలో జరిగింది. 1948 లో ఆంధ్ర విశ్వ విద్యాలయము నందు M.A నందు పట్టభద్రులైనారు.అనంతపురం నుండి శ్రీకాకుళము వరకు ఎన్నో ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తూనే సాహిత్య-అద్వైత వేదాంతోపన్యాసనలు కొనసాగిస్తూ 1982 లో కడపలో పదవీ విరమణ గావించిరి.
తర్వాత కాలము నుండి గురువు గారు హైదరాబాదులో నివసిస్తూ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వంటి అనేక గ్రంధాలును శంకర భాష్యంతో ప్రవచనాలు చేస్తూ తమ శిష్యులకు అద్వైత విజ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు. 2001 వ సంవత్సరమున గురువు గారు హైదరాబాదు నుండి విజయవాడకు తమ నివాసమును మార్చుకున్నారు. తర్వాత కాలము నుండి గురువు గారు విజయవాడ లో మరల ప్రస్థానత్రయం శంకర భాష్యంతోను, మానసోల్లాసము, వేదాంత పంచదశి, త్రిపురా రహస్యము, వేదాంత ప్రకరణ వంటి అనేక గ్రంధాలు మరియు శ్రీ లలితా సహస్రనామములు, శ్రీ విష్ణు సహస్రనామములు ను అద్వైత పరంగా సమన్వయం చేస్తూ తమ శిష్యులకు ప్రవచనముల ద్వార, గంధ రచనల ద్వార అందించిన జీనన్ముక్తులు. గురువు గారు అక్టోబర్ 2015 వ సంవత్సరము వరకు
60 సంవత్సరములు అద్వైత విజ్ఞానాన్ని అందిస్తూ 19 డిసెంబర్ 2015 వ సంవత్సరమున విదేహముక్తులైనారు.ఇంత జ్ఞానాన్ని లోకానికి అందించిన గురువర్యులు మహనేయులు, పూజ్యనేయులే.
గురువు గారు అద్వైత విచారణే జీవిత లక్ష్యంగా ప్రచారానికి దూరంగా జీవిస్తూ సాధన చేస్తూ సిద్దులై వారు సాదించిన అద్వైత విజ్ఞానాన్ని లోకానికి అందించాలని నిరంతరము కృషి చేసిన మహాజ్ఞాని.వారి ప్రవచనాలు శ్రవణము చేసే అద్వైత సాధకులు ఎవరికైన ప్రస్తానత్రంను శ్రవణం చేసిన వారికి గురువు గారి కృషి అర్ధమవుతుంది.
గురువు గారి ప్రవచనాలను website, youtube ద్వార అందించటం గురువు గారిని ప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో కాదు. గురువు గారు ప్రచారం కావాలని ఏ నాడు ప్రయత్నించ లేదు. ఈ ప్రయత్నం గురువు గారు జీవిత కాలం చేసిన కృషిని లోకానికి అందించాలని మాత్రమే.
గురువర్యుల సంస్మరణ
అంతవంత ఇమే దెహాః నిత్యస్యొక్తాశ్శరీరిణః |
అనాశినొఽప్రమేయస్య తస్మాద్యుద్ధ్యస్వ భారత || భ.గీ ౨-౧౮
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా || || భ.గీ ౨-౨౮
వేదాంత సంప్రదాయంలో గురువంటే కేవలము నామరూపముగల వ్యక్తి కాదు. స్థూల దేహేంద్రియ సంఘాతమును, సూక్ష్మ వ్యక్తిత్వమును
ఆత్మానాత్మ వివేకము ద్వారా విచారించి, అవిక్రియ ప్రత్యగాత్మను గుర్తించి, అపరోక్షానుభూతికలిగి, ప్రారబ్ధకర్మఫలమునకు ద్రష్టా-అనుమంతగా
(భ.గీ ౧౩-౨౨), జ్ఞాననిష్టలో ఉండే ఒక మహా ఋషి.
అటువంటి పురుషుని శుద్ధ మనస్సు నుండి వెలువడి, అజ్ఞానమును తొలగించు అక్షర-శబ్ద-వాక్యమే శాస్త్రము అని గ్రహించాలి. ఆచార్యులు
శాస్త్రము బోధించగా గురువు అజ్ఞానమును తొలగించును. భగవత్పాదులు గీతా భాష్యములో ’శబ్దైకప్రమాణగమ్యత్వాత్’ అని ద్రువపరిచారు కదా.
కాబట్టి మన ప్రియ ఆచార్య గురువర్యులు బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారు ఇక లేరు అను శోకము వ్యావహారికముగా సబబైననూ,
అవివేకమేగాక, వారి బోధనలకే విరుద్ధము. గురుశిష్య సంప్రదాయము వ్యక్తికి-మనిషికి మధ్య కాదు, అనాదిగా ప్రవహించు జ్ఞానికి-ముముక్షువగు
అధికారికి మధ్య పారుచున్న దివ్య వాణి.
శ్రీకృష్ణభగవానులు అర్జునుని నిమిత్తమూగా చేసి భగవధ్గీత బోధించగా, ఆ దుర్విజ్ఞేయార్థమును భగవత్పాదులు పరమ కరుణాభావముతో భాష్య
రూపములో మనందరికీ అందించిన భిక్ష. ఆ అక్షయ భిక్షను యోగ్యతగలవారికొరకు (భ.గీ తద్విద్ధి ౪-౩౪, శ్రద్ధావాన్ ౪-౩౯, ఇదం తే
నాతపస్కాయ ౧౮-౬౭) నిష్టలో ఉండి ప్రేమతో పంచిపెట్టువారందరు గురువర్యులే, చిరస్మరణీయులే. సాధకుని ఉద్దేశించి-’శాస్త్రాచార్యోపదేశ
శమదమాదిసంస్కృతం మనః ఆత్మదర్శనే కరణమ్’, అని ధ్రువీకరించారు భగవత్పాదులు.
అంటే మన ఆత్మస్వరూపమును అవినాశి తత్త్వముగా గుర్తించుటకు, అక్షర అక్షయ శాస్త్రము, ఆ తత్త్వ నిష్టలోనున్న గురువు, సంస్కరించబడిన
మనస్సు సాధన సామగ్రి. జగద్గురువులే మనులను ఉద్ధరించుటకు మన గురువుగారి కంచు కంఠము ద్వారా ప్రకటమైనారని భావించాలి.
ఉదయాస్తమములు లేని అవిపరిలుప్త, అవినాశి, అప్రమేయ, అక్షర, అనాదిమత్పరం బ్రహ్మ-ఆత్మ తత్త్వమును నిర్ధారించు వేదాంత శాస్త్రము
అంతిమ ప్రమాణము కాగా, ఒకానొక భంగిమలో నామరూపములు ధరించి జనించినట్లు, బోధనల అందించు మహాపురుషుడే గురువు. ఇదే
ఉపనిషత్తుల సారాంశము. గీతా శాస్త్ర సందేశము, పరమ గుహ్యము.
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ || భ.గీ ౧౦-౨౦
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి || భ.గీ ౨-౧౭
ఓం
హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు