• హోమ్
  •  
  • గురించి
  •  
  • ప్రవచనములు
  •  
  • గ్రంధములు
  •  
  • సంప్రదించండి
  •  
  • Youtube
  •  
  • English
  •  

పూర్ణానుభవము

గౌణానికీ మిథ్యకూ తేడా ఏమిటని అడగవచ్చు. పైకి చూస్తే రెంటికీ పెద్ద తేడా లేనట్టే గోచరిస్తుంది. కాని వివేచన చేస్తే తెలుస్తుంది బాగా విభేదముందని. రెండు వస్తువులు వేరువేరుగా ఉంటూ వాటికభేదాన్ని భావిస్తే అది గౌణం. పుత్ర మిత్ర కళత్రాదులనలాగే భావిస్తాము. నేనేనని భావిస్తున్నప్పుడు కూడా వారు నా శరీరం కంటే వేరుగానే కనిపిస్తున్నారు. వేరని తెలుసుకూడా మనకు. మరి ఇలాటి భేద ఙ్ఞానం మిథ్యలో లేదు. రెండూ వేరుగా కనపడవిక్కడ. రెంటిలో ఒకటి చూడకుండానే మరొకదానితో అభేదాన్ని భావించటం మిథ్య. శరీరాదికం నేనని భావించటమిలాంటిది. శరీరానికి వేరుగా ఆత్మనెప్పుడూ చుడలేదు మనం. అది దీనికి విలక్షణంగా ఒకటుందనే ఙ్ఞానమే లేదు మనకు. లేకుండానే దానినీ శరీరమని భ్రమపడుతున్నాము. శరీరం ఙ్ఞానానికి గోచరించేది. ఙ్ఞానం దాన్ని గ్రహించేది. గ్రహించేది గ్రహించబడేది ఎలా కాగలదు. అయినా దాన్నీ దీన్నీ ఏకం చేసి ఇదే నేనని దర్శిస్తుంటాము. ఇలాటి తాదాత్మ్య బుద్ధికి మిథ్య అని పేరు. ఆత్మ బుద్ధి మిథ్య అయితే ఆత్మీయ బుద్ధి గౌణం. శరీరాన్ని తప్పిస్తే నేను లేననే భావముంది మిథ్యలో. బాహ్యమైన బంధుమిత్రాదులను తప్పించినా నేనున్నాననే భావముంది గౌణంలో. ఒకటి అవినాభావం. మరొకటి వినాభావం. ఇదీ గౌణమిథ్యలకు రెంటికీ ఉన్న విభేదం.

మొత్తం మీద రెండూ చివర కసత్యాలే. గౌణ మిథ్యాత్మనో ౭సత్వే. గౌణమూ అసత్తే మిథ్యా అసత్తే. రెండూ అసలైన ఆత్మ కావు. పుత్రాదులయిన గౌణాత్మాకాదు. దేహాదికమైన మిథ్యాత్మా కాదు. పుత్రదేహాది బాధనాత్. రెండూ అసలైన ఆత్మ కానప్పుడు రెండూ బాధితమే. బాధితమంటే త్రోసిరాజయి పోవటమని అర్థం. త్రోసిరాజయి ఎక్కడికి పోతాయవి. దీనికి సమాధానమింతకు ముందే వచ్చింది, విశేషాలెప్పుడూ సామాన్యానికి భిన్నంగా ఉండలేవు. మృత్తును విడిచి ఘటశరావాదులెక్కడ ఉన్నాయి. సువర్ణాన్ని విడిచి కటక కుండలాదులెక్కడ ఉన్నాయి. స్వతంత్రంగా అస్తిత్వం లేదు విశేషాలకు. స్వతంత్రమైనది మృత్సువర్ణాది సామాన్యమే. అదే ఆయా విశేష రూపాలుగా భాసిస్తుంటుంది. సామాన్యంగానే వాటి కస్తిత్వం కాని విశేషాలుగా కాదు. సామాన్యంగా చూచినప్పుడవి బాధితమే. అలాగే ఈ గౌణమిథ్యాత్మలు కూడా అసలైన ఆత్మకు విశేషరూపాలు కాబట్టి తదాత్మకంగానే సత్యంగానీ తద్విశేషాలుగా సత్యంగావు. కనుకనే ఆత్మ స్వరూపంగా దర్శించినప్పుడివీ బాధితమై పోతాయి. అంటే గౌణంగా మిథ్యగా కనపడక ముఖ్యాత్మగానే మారిపోతాయని భావం.

పోతే ఇక అలా బాధితంగాక నిలబడే ఆ ముఖ్యాత్మ ఏది. అది కేవలం నేననే ఙ్ఞానం మాత్రమే. శరీరాదులతోనూ పుత్ర కళత్రాదులతోనూ మిళితం కానిదది. కనుకనే ఆకాశంలాగా నిరాకారం. నిరాకారం కనుక నిశ్చలం. తొలగిపోయేది కాదు. నేననే స్ఫూర్తి కనుక అది తనపాటికి తాను తొలగదు. గౌణమిథ్యలు రెండూ లేవు గనుక దాన్ని తొలగించేది ఏదీ ఉండబోదు. మిథ్యాత్మ అంటే జీవుడు. గౌణాత్మ అంటే జగత్తు. అవి రెండూ అసత్తయినాయి గనుక సద్రూపమైన ఆత్మ ఇది ఒక్కటే. సర్వవ్యాపకం గనుక బ్రహ్మమని కూడా దీనికే పేరు. సద్బ్రహ్మాత్మాహం. ఇలాటి సద్బ్రహ్మాత్మానే అహం అంటే నేను అని భావించాలి మనం. ఇత్యేవం బోధే. అలాటి ఙ్ఞానమే మన కుదయిస్తే కార్యం కథం భవేత్. ఇక కార్యమనేది ఎక్కడ ఉంది. కార్యమంటే సాధించవలసింది. సాధించవలసిన పదార్థమేదయినా ఒకటి ఉంటే గదా దాన్ని సాధించటం. మిథ్యగౌణాలు రెండూ ఆత్మలోనే కలిసిపోయి అదే ముఖ్యాత్మగా మన కనుసంధానమయినప్పుడిక జీవజగత్తులే లేవు గదా. అవి రెండూ లేకుంటే సంసారమే లేదు. అలాంటిప్పుడిక సాధించటమనే మాట కర్థమేముంది.


అన్వేష్టవ్యాత్మ విఙ్ఞానాత్ ప్రాక్ప్రమాతృత్వ మాత్మనః |

అన్విష్టః స్యాత్ప్రమాతైవ పాప్మదోషాది వర్జితః ||

దీనితో ప్రమాత శుద్ధి అయింది. ఇక ప్రమేయ శుద్ధి కావలసి ఉంది. ప్రమేయమనేది లేదు వాస్తవంలో. ఙ్ఞానానికి గోచరించేదే కదా ప్రమేయమంటే. అంతా ఙ్ఞాన స్వరూపమే. అది మన ఆత్మే అన్నప్పుడిక ప్రమేయమెక్కడిది. అయినా చిత్రమేమంటే ఒక ప్రమేయమనేది ఉన్నట్టు చూస్తున్నాము. అంటే ఏమన్నమాట. ఆత్మే తన్ను తాను రెండుగా మార్చుకొని చూస్తున్నది. అందులో చూచే ఆత్మ ప్రమాత అయితే చూడబడే ఆత్మను ప్రమేయమంటున్నాము మనం. అదీ వస్తుతః ఆత్మే. కాని మన అఙ్ఞానవసాత్తూ అది ఏదో దానికి బాహ్యమైన విషయంగా భావించాము. అలా భావించేసరికి దాన్ని అన్వేషించి పట్టుకోవాలనే ప్రయత్నమేర్పడింది. ఇదే అన్వేష్టవ్యాత్మ అంటే. అన్వేషణ సాగించినంతకాలమూ అది మనకు ప్రమేయంగానే గోచరిస్తుంది. విఙ్ఞానాత్ప్రాక్ప్రమాతృత్వ మాత్మనః అది ఫలానా అని దాని నిజ స్వరూపాన్ని గుర్తించనంత వరకూ మనం దానిని ప్రమాత అనే భావిస్తుంటాము. అప్పుడా ప్రమేయం మన పాలిటికొక జగత్తుగానూ ఈశ్వరుడుగానూ దర్శనమిస్తుంది. దాని నన్వేషించే ఈ ప్రమాత జీవుడుగా స్ఫురిస్తాడు.

Next
Back





     All Rights Reserved by M.Sudhakar  - 9440524168