• Youtube
    •  
    • English
    •  

పూర్ణానుభవము

Back

పూర్ణమదః పూర్ణ మిదమన్నట్టు పూర్ణమైనది ఆత్మచైతన్యం. అది మన స్వరూపమే. కనుక దానిని గుర్తించి అనుభవానికి తెచ్చుకోవటమే జీవిత పరమార్ధం. కాని ప్రమాత్రాదుల వ్యవహారమడ్డు తగులుతున్నంతవరకూ అది సాధ్యంకాదు. ప్రమాత్రాదులేమిటి. ప్రమాత, ప్రమేయమూ, ప్రమాణమూ ఇవి మూడే ప్రమాత్రాదులంటే. నాలో గ్రహించే ఙ్ఞానమేదున్నదో అది ప్రమాత. ఆ ఙ్ఞానానికేది గోచరిస్తున్నదో అది ప్రమేయం. అది బాహ్యమైన వస్తుజాలమే కావచ్చు. మనసులో కలిగే భావాలే కావచ్చు. రెండూ మనకు ప్రమేయమే. కాగా ఈ రెండింటికీ సంబంధాన్ని కలిపేదేదో అది ప్రమాణం. ప్రమాకరణం ప్రమాణం. ఙ్ఞానసాధనమని అర్థం. త్వక్చక్షుశ్శ్రోత్రాదులన్నీ ఇలాంటివే. వీటి మూలంగా మనకు బాహ్య జగత్తు తాలూకు ఙ్ఞానం కలుగుతున్నది. పోతే ఇది గాక భావజగత్తును గ్రహించడానికి మరొక ప్రమాణముంది మనకు. అది అంతరింద్రియమైన మనస్సు. ఇందులో మొదటి అయిదింటిని ప్రత్యక్షప్రమాణమనీ రెండవ దానిని అనుమాన ప్రమాణమనీ పేర్కొంటారు.

ఇంతకూ ప్రమాత అనండి. ప్రమేయమనండి. ప్రమాణమనండి. ఈ మూడింటి వల్లనే మనకీ సంసారమనేది ప్రాప్తించింది. ప్రమాత అయిన మనం చక్షురాదులైన ప్రమాణాలద్వారా ప్రమేయభూతమైన ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము. దీని మూలంగా కలిగే సుఖదుఃఖాలను మనస్సు ద్వారా అనుభవిస్తున్నాము. జాగ్రదవస్థలోనూ తప్పటంలేదీ అనుభవం. స్వప్నావస్థలోనూ తప్పటంలేదు. సుషుప్తిలో తప్పినట్టు కనిపించినా దాని వాసనలు పనిచేస్తాయి. కాబట్టి మరలా జాగ్రత్తులోకి రాక తప్పటం లేదు. ఇలాటి అనుభవమున్నంతవరకూ మనపాలిటికది బంధమేగాని మోక్షం కానేరదు. బంధంలో ఉండిపోవాలని ఎవడూ కోరుకోడు. దానిలోనుంచి బయట పడాలనే ఆలోచిస్తుంటాడు. బయట పడాలంటే దానికొక్కటే మార్గం. దేనిమూలంగా మనకీ సంసారబంధ మేర్పడిందో దాన్ని నివారించుకోవడమే. దేనిమూలంగా ఏర్పడిందిది. పైన చెప్పిన ప్రమాత్రాదులను మూడింటినీ నాకు వేరుగా భావించటం మూలాన. కాబట్టి అవి నాకు వేరుగావు నా స్వరూపమేనని గుర్తించటమే దీనికి పరిహారం.

నా స్వరూపమసలు శుద్ధమైన చైతన్యం. నేననే భావం తప్ప మరేదీ కాదది. నిరాకారం కాబట్టి ఆకాశంలాగా సర్వవ్యాపకం. చైతన్య స్వరూపం కాబట్టి స్వతస్సిద్ధం. కేవలం ఉండటమనే స్ఫూర్తి కాబట్టి అది సామాన్యం. పోతే మిగతా పదార్థాలన్నీ ఆయా నామరూపాలుగా ఉండటం కాబట్టి దానికవి విశేషాలు. విశేషాలెప్పుడు గానీ సామాన్యంకన్నా వేరుగావు. మృత్తికకన్నా ఘటశరావాదులు వేరుగావు గదా. సువర్ణంకన్నా కటక కుండలాదులు వేరుగావు గదా. అలాగే సచ్చిత్సామాన్యమైన ఆత్మకన్నా ఏదీ విలక్షణంగా లేదు. అంటే ప్రమతృ ప్రమేయ ప్రమాణాలుగా కనిపించే మూడూ వాస్తవానికాత్మ స్వరూపాలే. అయినా చిత్రమేమంటే ఆత్మ స్వరూపమయి కూడా అవి ఆత్మకు భిన్నంగా భాసిస్తున్నాయి. కారణం అఖండమైన మన ఆత్మచైతన్యాన్ని మనం గుర్తించకపోవటమే. దీనికే అఙ్ఞానమని పేరు. ఈ అఙ్ఞానం మూలంగా అఖండమైన మన స్వరూపమే ఖండమై ఒకటి ప్రమాతగా ఒకటి ప్రమేయంగా మరొకటి ప్రమాణంగా చలామణి అవుతున్నాయి. ఈ త్రివిధమైన రూపాలు ధరించి కనిపిస్తున్నదేదో గాదు మన ఆత్మచైతన్యమే.

అయితే ఎటువచ్చీ ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. గుర్తించాలంటే ప్రమాత్రాదులుగా గోచరమయ్యే ఈ మూడింటినీ చక్కగా వివేచన చేసి చుడాలి. వివేచించిన కొద్దీ ఇవి తమ నకిలీ వేషాలకు స్వస్తి చెప్పి అసలయిన ఆత్మస్వరూపంగా ఇవే మనకు దర్శనమిస్తాయి. అప్పుడంతా కలిసి ఒకే ఒక ఆత్మ అనే పూర్ణానుభవమప్రయత్నంగా మనకు సిద్ధిస్తుంది. ప్రస్తుత మా శోధన మార్గాన్నే ప్రదర్శిస్తున్నాయి మనకీ మూడు శ్లోకాలు. వీటిని గాథలనీ పేర్కొన్నారు శంకర భగవత్పాదులు. ఇవి ఏ గ్రంథంలోనివో తెలియదు. వీటికి కర్త ఎవరో తెలియదు. బహుశా బ్రహ్మవేత్తల గురుశిష్య పరంపరలో అనూచానంగా వస్తున్నవి కాబోలు. భాష్యకారులు కూడా కేవలం బ్రహ్మవిదాం గాథాః అని మాత్రమే పేర్కొన్నారు. అంతకుమించి మరేమీ మాటాడలేదు. ఇవి తమ చతుస్సూత్రి భాష్యం చివరన వారుదహరించిన శ్లోకాలు. క్రమంగా ఒక్కొక్క దానిని పరిశీలించి చూతము.

గౌణ మిథ్యాత్మనో ౭సత్వే పుత్రదేహాది బాధనాత్ |

సద్బ్రహ్మాత్మాహ మిత్యేవం బోధే కార్యం కథం భవేత్ ||

ఆత్మ అంటే కేవలం నేను అనే ఙ్ఞానం. మనమిప్పుడు నేను అనుకొనే ప్రమాత అసలయిన ఆత్మకాదు. ఇది నకిలీ ఆత్మ. నేను అనే ఙ్ఞానమున్నా ఇది ఆభాస రూపమేగాని వాస్తవం గాదు. ఆభాస అనేది రెండు విధాలు. ఒకటి గౌణం. మరొకటి మిథ్య. గుణానిని సంబంధించినదేదో అది గౌణం. సింహోదేవదత్తః. దేవదత్తుడు సింహమేనని వర్ణించారనుకోండి. నిజంగానే సింహమవుతాడా అతడు. సింహంలో ఉన్న ధైర్య సాహసాది గుణాలతడిలోనూ కనపడుతున్నాయి గనుక గుణసామ్యాన్ని బట్టి అలా వర్ణించాము. అంతమాత్రమే. అలాగే మనచుట్టూ ఉన్న పుత్ర మిత్ర కళత్రాదులనూ, గృహారామక్షేత్రాదులనూ నావేనని అభిమానిస్తుంటాము మనం. వాస్తవంలో ఇవేవీ నేను కాదు. నేను వేరు, అవి వేరు. అయినప్పటికీ నామీద నాకెలాటి అభిమానమున్నదో అలాటి అభిమానమే వాటి మీదా పెట్టుకున్నాను. కాబట్టి దేవదత్తుడే సింహమన్నట్లుగా ఈ బంధుమిత్రాదులను నేనని భావిస్తుంటాను. అభిమానమనే గుణాన్ని బట్టి ఏర్పడింది గనుక గౌణాత్మే గాని ఇది ముఖ్యాత్మకాదు. దేవదత్తుడే సింహం కానట్టే నా తాలూకు పదార్థాలేవీ నేను కాను.

పోతే రెండవది మిథ్యాత్మ. అది కాని వస్తువు నది అని భ్రమించటం మిథ్య. చీకట్లో నడచిపోతుంటాము. దారి ప్రక్కన ఒక ఇంటిపంచలో ఒకరెవరో నిల్చున్నట్టు కనిపిస్తుంది. ఎవడో దొంగ అయి ఉంటాడని అనుమానిస్తాము. అది దొంగ కాదు. అక్కడే ఉన్న స్తంభం. స్తంభాన్ని చుచి దొంగ అని భయపడ్డాము. స్తంభమని తెలియక దానిమీద పురుషుడి రూపాన్ని ఆరోపించాము. ఆరోపించేసరికి స్తంభరూపం మరుగునపడి దాని స్థానంలో చోరుడి రూపమే మనకు సాక్షాత్కరించింది. అలాగే ప్రస్తుతం మన ఆత్మచైతన్యాన్ని గుర్తించని కారణంగా ఆ చైతన్యమే ఈ శరీరాది సంఘాతంగా కనపడుతున్నది. అక్కడ చోరుడిలాగా నిజానికిక్కడా ఈ శరీరం లేదు. ఇది కేవలం మన కల్పనే. కల్పన గనుకనే యదార్థం కాదు. యదార్థంగా ఉన్నదక్కడ స్తంభమైతే ఇక్కడ మన ఆత్మచైతన్యం. కానీ స్తంభంలాగా మరుగునపడి మనకది కనపడటం లేదు. కనపడుతున్నది దాని మారుగా మిథ్యాభూతమైన శరీరమే.

Next





     All Rights Reserved by M.Sudhakar  - 9440524168