• హోమ్
  •  
  • గురించి
  •  
  • ప్రవచనములు
  •  
  • గ్రంధములు
  •  
  • సంప్రదించండి
  •  
  • Youtube
  •  
  • English
  •  

అద్వైత విజ్ఞాన సారము

Back

కనుక అసలైన ఆత్మ ఏదో గుర్తించవలసిన అవసర మేర్పడుతున్నది, అలా చేయాలంటే ఆత్మలో ప్రవేశించిన అనాత్మ భాగాలను ఒక్కొక్కటే "నేతి - నేతి" అని వేరు చేసి మిగిలిపోయిన చైతన్య భాగమేదుందో దానినే ఆత్మగా గ్రహించవలసి ఉంది. దీనికే ఆత్మా నాత్మ వివేచన అని పేరు. దీని వలన ఆత్మ ఎంత వరకో అనాత్మ ఎంత వరకో నిష్కర్షగా తెలిసిపోతుంది. ఆత్మ అంటే నేననే స్ఫురణ మాత్రమే నని కదా చెప్పాము. అంత వరకే కేటాయించి చూస్తే ఇక శరీరమని, ఇంద్రియాలని, ప్రాణమని, మనస్సని, కర్తృరూపమైన అహమని ఆలోచన రకూడదు. ఈ కలాపంతో కలిసి దానిని చూడరాదు. చూచినా ఈ ఉపాధులు వాస్తవానికి దానిలో చేరవు. దానినంటవు. కారణమేమంటే నేననే జ్ఞానం ఆకాశం లాగా నిరాకారం. అసంహతం. అహంకారం మొదలుకొని త్వగింద్రియం దాకా మిగతా ఉపాధి వర్గమంతా సాకారం, సంహతం. అలాంటప్పుడు ఇవన్నీ "నేను" ఎలా అవుతాయి. నాకు గోచరించే వివి. మహా అయితే నావి కావలసిందే కాని నేను కాలేవు. నాకు గోచరించే దంతా నేయయితే భార్యా పుత్త్రాదులు, గృహా రామాదులు, ఇవి కూడా నేను కావలసివస్తుంది. కాని వటిని మనం నేననుకోటం లేదు కదా. అలాంటప్పుడు శరీరేంద్రియాలను మాత్రమే నేనని భావించట మేమిటి హాస్యాస్పదం కదా.

అలా భావించే సరికి ఆత్మకు దీనితో తాదాత్మ్య మేర్పడింది. అది క్రమంగా దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, విజ్ఞానాత్మ (బుద్ధ్యాత్మ) కర్త్రాత్మ (అహంకారం) - అని ఎలా ఆయా స్ధాయికి దిగజారి ఎక్కడికక్కడ పరిచ్ఛిన్నమై కలుషితమైపోయింది. దీనికే మిధ్యాత్మ అని అద్వైతులు పెట్టిన పేరు. ఈ మిధ్యాత్మే ఇప్పుడు మనం నేను - నేను అని దగ్గర పెట్టుకున్న ఆత్మ. ఇది శరీరాది సంఘాతంగా మారి అంత వరకే ఆగిపోయిన ఆత్మ. దీనినే అసలైన ఆత్మ అని - శరీరం సరిహద్దులు దాటి ఉన్న ప్రపంచమే అనాత్మ అని - అనాత్మకు చెందిన దేహాతులను ఆత్మలో చేర్చుకున్నాము.

నిజానికీ దేహాదులు కూడా ఘట పటాదుల లాగా ఆత్మకు స్ఫురిస్తున్నవే కనుక బాహ్య జగత్తు లాగా ఇదీ అనాత్మ క్రిందికే వస్తుంది. అందులో కొంత అనాత్మ భాగాల్ని ఆత్మగా భావించటం పెద్ద పొరపాటు. దాని ఫలితమే ఈ మిధ్యాత్మ. పోతే దాని చుట్టూ ఉన్నదే అనాత్మ ప్రపంచమని దాన్ని మరలా నాది - నాది అని చూస్తున్నాము. ఈ నాది అనుకునే బాహ్య ప్రపంచమే గౌణాత్మ. కాగా ఇవి రెండూ కూడా దొంగలే. అసలైన ఆత్మ కావివి. అనాత్మే. అంటే కర్తృ రూపమైన అహంకారం మొదలు శరీరం వరకు. శరీరం మొదలు బాహ్యమైన ప్రపంచం వరకు - అంతా అనాత్మ క్షేత్రమే. పోతే ఈ క్షేత్రమంతా ఏ జ్ఞానానికి స్ఫురిస్తున్నదో అది ఒక్కడే క్షేత్రజ్ఞుడైన ఆత్మ. తొంబది తొమ్మది ఇవి (99) అయితే అది ఒక్కటే ఒక్కటి. ఇది నామరూప క్రియాత్మకంగా విభక్తమై కనిపిస్తుంటే అది అవిభక్తంగా దీన్ని దర్శించే తత్త్వం.

అలాంటప్పుడిక నిజంలో దానికి దేహాది సంఘాతంతో ఎలాటి సంసర్గమూ లేదు. విడిబడే ఉంటుంది. అలా ఉంటే అది అసంహతం, నిరాకారం. అప్పుడు సాకారమైన దేహాదులను ముందుకు తోసి అది వీటి నుంచి వెనక్కు మళ్ళుతుంది. వెనక్కు మళ్ళక పోతే తన ముందుకు వచ్చిన ఈ దృశ్య వర్గాన్ని అది దర్శించలేదు. మరి దర్శిస్తూనే ఉన్న దిప్పుడు. కాబట్టి ఆమేర కది వీటన్నిటికీ వెనకాల ఉండవలసిందే. దీనికే ప్రత్యగాత్మ అని పేరు. సాకారమైన. సంహతమైన, శరీరాదులతో చేయి కలపక వాటి నుంచి తొలగిపోయే సరికి ఇక శరీరంలో ఉండవలసిన ఆగత్యం లేదు దానికి. సాకారంలో నిరాకారమైన తత్త్వం ఎప్పుడూ ఇమిడి పోదు. కనుక ఒక ఘటాకాశం లాగా అది శరీరంలో ఎంత ఉందో శరీరం వెలపల కూడా అంతగా వ్యాపించగలదు. అలా వ్యాపించే ఈ ప్రత్యగాత్మనే పరమాత్మ అని పేర్కొన్నారు పెద్దలు. విడిబడింది కనుక ప్రత్యక్, వ్యాపిస్తుంది కనుక పరమ. అప్పుడు దాని స్వరూప మేమిటి! మొదట చెప్పిందే. సత్తు చిత్తు. చిత్తు దాని స్వరూపం. సత్తు దాని అస్తిత్వం. సర్వత్రా ఉండాలి గనుక ఇక దేహాత్మ కాదది. అంటే మిధ్యాత్మ లేదు. ఎగిరి పోయింది. మిధ్యాత్మ లేకుంటే గౌణాత్మ కూడా లేదు. ఎందుకంటే దేహం వరకే నేననుకుంటే నే ఇది కాని దంత నేను కాదు నాది అనే భావ మేర్పడింది. అంతటా నేనే వ్యాపించినప్పుడు ప్రత్యేకించి నాదనేది లేదు. ప్రత్యేకించి నేననే మిధ్యాత్మ ఎలా లేదో ప్రత్యేకించి నాది అనే గౌణాత్మ కూడా లేదు.

అంటే ఏమన్న మాట. అహంకార మమ కారాలమే రెండి అడ్డు గోడలూ కూలిపోయాయి. వాటి రెండింటి బదులూ ఆత్మ ఒక్కటే మిగిలిపోయింది. ఇది గౌణం కాదు. మిధ్య కాదు. పరిశుద్ధమైన ఆత్మ. దీనికే ముఖ్యాత్మ అని పేరు. అసలైన సిసలైన ఆత్మ ఇదే. ప్రత్యగాత్మ ఐనా ఇదే పరమాత్మ ఐనా ఇదే. సచ్చిద్వెశేషం కాదిది. కేవలం సచ్చిత్తులే. ఇదే మహా సామాన్యమంటే. పోతే ముందు చెప్పిన గౌణ మిధ్యాత్మలు (బ్రహ్మాండ, పిండాండాలు) రెండూ దీనికి విశేషాలు. అందులోనూ సద్విశేషం ప్రపంచమైతే, చిద్విశేషం జీవుడు. విశేషమంటే ఫలానా అనే భవం. నేను ఫలనా అని భావించే జ్ఞానమే కదా జీవుడు. కనుక ఇది చిద్విశేషం. దీనికే నామమని గూడా పేరు(idea). ఇలాంటి వృత్తి జ్ఞానంతో దర్శించే బాహ్యమైన జ్ఞేయ ప్రపంచమంతా సద్విశేషం. ఊరక ఉందని చూస్తే విశేషం కాదిది, సత్సామాన్యం. అలా కాక ఫలానా ఘటంగా ఉంది. పటంగా ఉందని చూస్తాము గాబట్టి సద్విశేషమైంది ఈ బాహ్య ప్రపంచం. ఈ సద్వి శేషానికే రూపమని గూడా పేరు. లోపల చిద్విశేషమైన నామం జీవుడు - వెలపల సద్విశేషమైన రూపం జగత్తు. ఈ రెండింటిలో ఒకటి గ్రహించేది, ఇంకొకటి గ్రహించబడేది. రెంటికీ ఉన్న సంబంధమే క్రియ. నామరూపాలు రెండూ రెండు తీరాలైతే క్రియ అనేది రెండూ తీరాలనూ కలిపే ఒక పెద్ద వంతెన. ఇదే త్రిగుణాత్మకమైన సంసారం.

ఈ సంసారమే ఇప్పుడు మనకెదురైన సమస్య. దీని వల్లనే సుఖదు:ఖాదుల అనుభవం ఏర్పడుతూ ఉంది. చివరకు జనన మరణానుభవం కూడా దీని వల్లనే సంప్రాప్త మౌతున్నది. ఇంతకన్నా పెద్ద సమస్య మరొకటి ఏముంది. ఎవరికీ సమస్య. ఎవరనుభవిస్తే వారికి. ఎవడా అనుభవించే వాడు. ఆత్మ కాదు. అనాత్మ జగత్తు కాదు. ఆత్మ అనేది నిరాకారం సర్వవ్యాపకం పరిపూర్ణమని చెప్పాము. పోతే అనాత్మ అనేది కేవలం జడం పరిచ్ఛిన్నమని పేర్కొన్నాము. సమస్య ఎప్పుడూ పరిపూర్ణమైన చేతనకూ లేదు. పరిచ్ఛిన్నమైన జడానికీ లేదు. కారణం మొదటి దానికి విశేష దృష్టి లేదు. రెండవ దానికి అసలు దృష్టే లేదు. కనుక విశేష రూపమైన ఈ సంసారానుభవం రెండింటికీ లేదు.

ఆత్మా నాత్మలకు రెండింటికీ లేకపోతే మరి దేనికిక? మూడవదైన జీవుడికే ఈ అనుభవం. వీడు ఆత్మలాగా సామాన్య దృష్టీ కాదు, అనాత్మ ప్రపంచం లాగా కేవల దృశ్యమూ కాదు. దృక్ - దృశ్యాల రెండింటి కలయిక. దీనినే గ్రంధి అని వర్ణించారు. దృశ్యంలో కొంత నేనని తనలో కలుపుకున్న దృక్కు. సామాన్య చైతన్యం కాదిది. విశేష చైతన్యం. దీనికే చిదాభాసుడని జీవాత్మ అని పేరు. వీడికున్నది విశేష దృష్టి మాత్రమే. వచ్చిన ఇబ్బంది ఏమంటే విశేష దృష్టితో చూస్తే ఎప్పుడూ విశేష దృశ్యమే కనిపిస్తుంది. కనిపించే కొద్దీ దానితో అతడు తాదాత్మ్యం చెందాడు గనుకనే విశేష దృశమైన జగత్తుతో కూడా చెందుతూ వచ్చాడు. అలా చెందే సరికి దాని కష్ట సుఖాలు వీడికి సంక్రమించాయి. ఇదే సంసారానుభవం. విశేషమే నేననుకొనే సరికి విశేష ధర్మాలన్నీ నావే అవుతాయి. ’యద్భావ స్తద్భవతి’ ఈ విశేష ధర్మాలే సుఖదు:ఖాలు - జనన మరణాలు.


Back Next





     All Rights Reserved by M.Sudhakar  - 9440524168