అద్వైతమనేది ఒక వాదం కాదు. ఒక మతం కాదు. అది సిద్ధాంతం. ఎవరి వాదం వారు వినిపించిన తర్వాత కోర్టులో జడ్జీగారు తీర్పు చెబుతారు. తీర్పు చెప్పిన తరువాత ఇక వాదం లేదు. అక్కడకన్నీ సమసిపోతాయి వాదాలు. అలాగే మీరు సాంఖ్య మనండి. యోగమనండి. న్యాయమనండి. వైశేషిక మనండి. ఆఖరుకు పూర్వోత్తర మీమాంశలనండి. అంతే్గాదు. ఆనాటి షడ్దర్శనాలే కాక ఈనాటి శాస్త్రజ్ఞులు చేసే పరిశోధనా ఫలితాలనండి మానవుడి విజ్ఞానం ఎన్ని మార్గాలలోనైనా సాగిపోవచ్చు. అదంతా పురోగతి అని మనమెంతైనా సంతోషించవచ్చు. కానీ ఇవన్నీ వారి వారి మతాలే-వాదాలే. సిద్ధాంతం కాదు. సిద్ధాంతమంటే ఇక దాని తరువాత నీవు తెలుసుకోవలసినది ఏదీలేక పోతేనే అది సిద్ధాంతం. అలాటిదొక్క అద్వైత జ్ఞానం తప్ప మరేదీ లేదు. అప్పుడూ లేదిప్పుడూ లేదెప్పుడూ లేదని ఘంటాపధంగా చెప్పవచ్చు.
అది ఎలాగా అని అడుగుతారేమో. అసలద్వైతమనే మాటలోనే ఉంది జవాబు. సృష్టిలో కనిపించే పదార్ధాలెన్నో అసంఖ్యాకంగా ఉన్నట్టు కనిపిస్తాయి నీకూ నాకూ, కాని విమర్శించి చూస్తే ఎన్నో కావవి. అన్నీ కలిసి ఒకే ఒక పదార్ధం. అది ఎదోగాదు నా నీ స్వరూపమే. ఇదీ అద్వైత మనే మాటకర్ధం. ద్వైతం కానిదేదో అది అద్వైతం. ద్వైతమంటే ఒకదానికొకటి వేరుగా అన్యంగా కనిపించేదంతా ద్వైతమే. సాంఖ్యం దగ్గరి నుంచి పూర్వోత్తర మీమాంసల వరకూ ఆయా మతాచార్యులు లోకానికి బోధించినదంతా ద్వైతమే నని అన్నింటికీ ద్వైతమనే ముద్ర వేశారు శంకరభగవత్పాదులు. ఒకటి అనే సంఖ్య దాటి ఇక ఎన్ని పరిగణించినా అది ద్వైతమే.
సాంఖ్యాన్ని ప్రచారం చేసిన కపిలాచార్యుడు ప్రకృతి అని పురుషుడని రెండు పదార్ధాలు చెబుతాడు. ప్రకృతి కూడా ఒకటిగాదు. సత్వం రజస్సు తమస్సని మూడు గుణాలున్నాయందులో. దానితో మహత్తనీ అహంకార మనీ అనేక విధాలుగా మారిపోతుందది. అలాగే పురుషుడు కూడా ఒకడు గాదు. పురుషుడంటే జీవుడు. కోటాన కోట్లున్నారు జీవులు సృష్టిలో. ప్రకృతికీ పురుషుడికీ సంబంధం లేదు. జీవుడికీ జీవుడికీ లేదు - దేని స్వభావం దానిదే. పోతే యోగాచార్యుడు పతంజలి ప్రకృతి పురుషులతోపాటు ఈశ్వరుడనే మూడవతత్వాన్ని కూడా ఒప్పుకొన్నాడు. అందుకే కపిలుడిది నిరీశ్వర సాంఖ్యమైతే పతంజలిది సేశ్వర సాంఖ్యమని పేరు వచ్చింది. ఇక నైయాయికులూ వైశేషికులూ ఇద్దరున్నారు. మొదటి దానికి మూలపురుషుడు గౌతముడైతే రెండవ దానికి కణాదుడు మూలపురుషుడు. ఇద్దరికీ కలిపి తార్కికులని పేరు. ఇందులో నైయాయికులు పదహారు పదార్ధాలు పరిగణిస్తే వైశేషికులు ఏడు పదార్ధాలంగీకరిస్తారు. మరి పూర్వమీమాంసకులున్నారు జైమిని మహర్షి అనుయాయులు - కర్మ మీమాంసకులని పేరు వారికి. నిత్యనైమిత్తికాదులైన కర్మలుతప్ప వీరికేదీ కాబట్టదు. ఏవి విధులో ఏవి నిషిద్ధాలో తెలుసుకోవాలంటే ప్రమాణమొక్క వేదమే వారికి. సత్కర్మానుష్ఠానమూ దానివల్ల స్వర్గసుఖాలూ తరువాత ఉత్తమ జన్మలూ అందులో అంతకంతకూ అభ్యుదయ ప్రాప్తీ - ఇది తప్ప మరొక మాటే లేదు - ఆఖరుకు శబ్ద ప్రమాణమైన వేదం తప్ప విడిస్తే ఈశ్వరుణ్ణి కూడా ఒప్పుకోరు మీమాంసకులు. సాంఖ్యులెలా నిరీశ్వరులో వీరూ నిరీశ్వరవాదులే. ఇద్దరూ నాస్తికులే ఒకవిధంగా.
కాగా ఇక ఉత్తర మీమాంసకులు. వీరిలో ద్వైతులున్నారు - విశిష్టాద్వైతులున్నారు. ఇద్దరికీ వేదం ప్రమాణమే - దానితోపాటు వేదవైద్యుడైన ఈశ్వరుడూ వున్నాడు వీరికి. అయితే ద్వైతులా ఈశ్వరుడు విష్ణువనేగాక శివుడికి కూడా ఆయన తరువాత స్థానమిస్తే విశిష్టాద్వైతులకు విష్ణువు తప్ప శివుడికి ప్రవేశమే లేదు. ఈ రెండు మతాలూ వేదకాలం నుంచి వస్తూ ఉన్నవే. ద్వైతానికి బేధవాదమనీ విశిష్టాద్వైతానికి భేదా భేద వాదమనీ అప్పటి వ్యవహారం. కాలాంతరంలో రామానుజులు వచ్చి విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేస్తే మధ్వాచార్యులు ద్వైతాన్నే పట్టుకొని ప్రచారం చేసారు. ఇందులో విశిష్టాద్వైతులు జీవుడు జగత్తు ఈశ్వరుడు మూడు పదార్ధాలొప్పుకున్నారు. వీటికే తత్త్వ త్రయమని పేరు పెట్టారు. ఈశ్వరుడికి శేషి అని జీవ జగత్తులకు శేషమని వారి పరిభాష. పోతే ద్వైతులు కేవలం భేదవాదులు కాబట్టి వారీ మూడింటిలోనే అయిదు భేదాలు కల్పించుకొన్నారు. అయిదూ సత్యమే వారికి. జీవుడికీ జీవుడికీ భేదం. జీవుడికీ జగత్తుకూ భేదం. జగత్తుకూ జగత్తుకూ భేదం. జగత్తుకూ ఈశ్వరుడికీ భేదం. ఈశ్వరుడికీ ఈ రెండింటికీ భేదం. ఇవే ఆ అయిదూ.
పోతే ఇక బౌద్ధులున్నారు, జైనులున్నారు, చార్వాకాదులున్నారు. వీరంతా నాస్తికులు. బౌద్ధులకు రూప విజ్ఞానాదులు పంచ స్కంధాలున్నాయి. జైనులకు జీవా జీవాదులైన సప్త పదార్ధాలున్నాయి. మరి భౌతిక వాదులైన చార్వాకాదులందరికీ జీవులున్నారు, జగత్తున్నది. కష్ట సుఖాలున్నాయి. జనన మరణాద్యను భావాలున్నాయి. మహా అయితే ఆత్మ లేదు. పరమాత్మ లేడు. పరలోకాదులు లేవు. జన్మాంతరాలు లేవు. అంత మాత్రమే.